ఆహార నియమాలు తెలుసుకుందాం

విటమిన్స్ – వాటి ఆవశ్యకత అవి లభించే ఆహార పదార్థాలు

శరీర పెరుగుదలకు, అవయవాలు చురుకుగా పనిచేయుటలో విటమినులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక్కొక్క విటమినుకు కొన్ని నిర్దిష్టమైన విధులున్నప్పటికి కొన్ని పదార్థాలలో ఈ విటమిను లన్నియు సమిష్టిగా పాల్గొని శరీర ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి.మన శరీరానికి కావలసిన విటమినులన్నీ ఆహార రూపంలో మనకు లభ్యమవుతాయి. కొన్ని విటమినులు ప్రకృతి సిద్ధంగా మన శరీరంలోనే తయారవుతాయి.

విటమిన్ బి1 (Thiamine)– ఆవశ్యకత

ఇది గోధుమలు, వరి, పప్పుధాన్యాలు, పాలు గ్రుడ్లులలో ఎక్కువగా లభ్యమవుతుంది. మొలకెత్తినధాన్యాలలో ఇది అధికశాతం ఉంటుంది. ఈ విటమిను లోపించిన బెర్రిబెర్రి, మానసిక రుగ్మత, నరాల బలహీనత మొ|| వ్యాధులు కలుగును.

విటమిన్ బి2 (Riboflavin) – ఆవశ్యకత

పాలు, వెన్న, గుడ్లు మొద లగువానియందు దొరుకును. ఇదిశరీరములోని జీవకణాలసంఖ్య పెరుగు దలకు (శరీర ఎదుగుదల) ఉపయోగపడును. గాయాలు మొదలగు వానివలన నాశనమైన శరీర కణాలను తిరిగి ఏర్పరచును, శరీరము నందు రోగనిరోధక శక్తిని పెంపొందించును. ఈ విటమిను లోపించిన శరీరమునందు పగుళ్ళు, పెదిమలు పగులుట ఏర్పడును.

విటమిన్ బి6 (Pyridoxine)– ఆవశ్యకత

చేప, నత్తలు, పప్పుధాన్యాలు,కాబేజి, పాలు మొదలగువాని యందు ఉండును. పాలు ఎక్కువ సేపు మరగకాచిన ఈ విటమిను నశించును. ఈ విటమిను లోపించిన చర్మ వ్యాధులు, నిద్రలేమి మొదలగు వ్యాధులు కలుగును. క్షయ వ్యాధి కొ రకు మందులు వాడుచున్నవారు ఈ విటమిను అధిక శాతంలలో తీసికొనవలెను.

విటమిను బి12 (Cyanocobalamin)- ఆవశ్యకత

ఇది మాంసా హారంలో ఎక్కువగా లభ్యమగును. పాలు, గ్రుడ్లు, గింజధాన్యంమొదలగువాటియందుకూడా ఉండును. ఈ విటమిను లోపించిన ఒళ్ళు , తిమ్మిర్లు పట్టుట, సూదులు గుచ్చినట్లుండుట, నరముల బలహీనత, పక్షవాతం మొ|| వ్యాధులు కలుగును. జ్ఞాపకశక్తి నశించును.

నియాసిన్ – ఆవశ్యకత

ఇది విటమిను “బి” కుటుంబానికి చెందిన మరోవిటమిను ఇది నిండుగింజలు, పాలు, మాంసము (లివర్, కిడ్నీ) గ్రుడ్లు మొదలగువానియందుండును. రక్తమునందు కొలస్ట్రాల్ ను తగ్గించుటకు పెల్లగ్రా అనువ్యాధి నివారించుటకు సాయపడును.

విటమిను సి (Ascorbic Acid)– ఆవశ్యకత

అకుకూరలు, పుల్లనిపండ్లు, పెరుగు, టామాటో, కాబేజి, మిరియాలు మొదలగువానియందుండును. స్కర్వీ (శ్రీతార) అనువ్యాధినుండి ఈ విటమిను కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, అంటువ్యాధులనుండి కాపాడుతుంది. కాల్షియం వినియోగంలో సాయపడుతుంది. గాయాలు మాన్పి, రక్తనాళాల పటుత్వాన్ని రక్షించడం మొదలగునవి ఈ విటమిను యొక్క విధులు.

విటమిను డి – ఆవశ్యకత

గ్రుడ్లు, పాలు, వెన్న, మీగడ, చేపనూనెలు మొదలగు వానియందుండును. సూర్యుని నుండి వెలువడు అల్ట్రా వైలెట్ కిరణాలనుండి శరీరమే ఈ విటమిను తయారు చేసుకోగలదు . ఈ విటమిను లోపంవలన ఎముకల నిర్మాణలోపాలు, రికెట్స్, (పిట్ట రూపుజబ్బు ఇది పిల్లలలో కనిపించును) మొదలగునవి కలుగును పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇది ముఖ్యమైన విటమిను.

విటమిను ఇ – ఆవశ్యకత

ఈ విటమిను బచ్చలి, గోధుమ, దుంపకూరలు గింజలు, మొదలగు వానియందుండును. ఇది సంతానోత్పత్తికి తోడ్పడుతుందని ఒక నమ్మిక.

విటమిను ఏ– ఆవశ్యకత

పాలు, గుడ్డు. జంతు సంబంధమైన ఆహారంలో, కారెట్, టమాటో. ఆకుకూరలు, పండ్లు, కాడ్ లివర్ ఆయిల్ మొదలగువానియందుండును. ఈవిటమిను పెరుగుదలకు తోడ్పడును రోగనిరోధకశక్తిని కలిగించును. ఈ విటమిను లోపించిన రేచీకటి, : దృష్టిలోపము మొదలగు కంటి సంబంధమైన వ్యాధులు కలుగును.

వ్యాఖ్యానించండి