మన శరీరంలోని క్లోమగ్రంధి (పాంక్రియాస్) క్లోమాన్ని (ఇన్సులిన్ ని) ఉత్పత్తి చేస్తుంది. మనం ఆహారం తిన్న తరువాత క్లోమగ్రంధి క్లోమాన్ని ఉత్పత్తి చేస్తే, ఆ క్లోమం రక్తంలో ఉన్న చక్కర / గ్లూకోస్ లను శక్తి క్రింద మార్చి శరీర కణజాలానికి అందజేస్తుంది. ఏదైనా కారణం చేత శరీరంలో తగినంత క్లోమం (ఇన్సులిన్) ఉత్పత్తి జరగక పోతే అప్పటి శరీరం లోని వైద్య పరిస్థితిని మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్ – DM) అని అంటారు. ఆయుర్వేద గ్రంధాలలో చెప్పినట్లుగా ఈ మధుమేహం అనేది 20 రకాల ప్రమేహాలలో (మూత్ర సంబంధిత రుగ్మతలలో) ఒకటి. ఈ మధుమేహాన్ని ఓజోమేహం మరియు క్షముద్రమేహం అని కూడా అంటారు.
ప్రపంచంలో సంభవించే మరణాలలో, మధుమేహం మరణానికి ఏడవ-ప్రధాన కారణం. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మధుమేహం పెరుగుతోంది. మధుమేహాన్ని ఎక్కువకాలం అదుపులో వుంచుకోకపోతే మూత్రపిండాలు కళ్ళు, నరములు, గుండె మరియు రక్త నాళములు పాడైపోయే అవకాశం ఎక్కువ. నిజానికి అదుపులో లేని మధుమేహం శరీరంలోని ప్రతి అవయువం మీద దుష్ప్రభావం చూపిస్తుంది.
ఇప్పుడు మధుమేహంలోని రకములు, రావడానికి గల కారణాలు, నియంత్రణలో లేకపోతే వచ్చే పర్యవసానాలు, చేయవలసిన మరియు చేయకూడని పనులు ఇక్కడ చూద్దాము.
మధుమేహం – రకములు
మధుమేహం ఈ క్రింద చెప్పిన రకాలుగా వుండవచ్చు.
మొదటి రకం మధుమేహం (టైపు–1 DM)
ఈరకమైన మధుమేహం క్లోమగ్రంధి లోని బీటా కణములు విధ్వ౦సం అవ్వడం మూలంగా వస్తుంది. (ఈ మొదటి రకం మధుమేహం గురుంచి ఇందులో మనం చర్చించడంలేదు.)
రెండవ రకం మధుమేహం (టైపు-2 టీమ్)
శరీరంలో తయారు అయిన ఇన్సులిన్ని శరీరంలోని కణజాలం సరిగా సంగ్రహించలేనపుడు (ఇటువంటి లక్షణం ముఖ్యంగా వయసుతో పాటు పెరుగుతుంది)లేదా శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు ఈరకం మధుమేహం వస్తుంది.
కొన్ని ప్రత్యేక రకములు
(వీటి గురించి కూడా మనం ఇందులో చర్చించం)
- జన్యుపరంగా వచ్చే ఇబ్బందుల వల్ల కలిగే మధుమేహం
- క్లోమగ్రంధికి (పాంక్రియాస్ కి) వచ్చే జబ్బుల వలన కలిగే మధుమేహం
- కొన్ని రకాల మందులు మరియు రసాయనాల వలన కలిగే మధుమేహం
- పుట్టుకతో వైరస్ సంక్రమించడం మూలముగా వచ్చే జబ్బుల వలన కలిగే మధుమేహం
- మొదలైనవి
మధుమేహం – లక్షణాలు
- ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసి రావడం
- ఎక్కువగా ఆకలి వేయడం
- అతి దాహము (ఎక్కువగా దాహం వేయడం)
- మూత్రము మలినములు కలిగి వుండటము
- నిస్సత్తువగా / బలహీనం గా వుండటము
- త్వరగా అలసి పోవడం
- కారణము లేకుండా బరువు తగ్గడం
- కురుపులు / పుళ్ళు తగ్గకపోవడము
- కంటిచూపు మందగించడం / చూపులో తేడాలు రావడం
- మూత్రము ఆపుకోలేకపోవడం
- కాళ్ళు మొద్దుబారుట లేక చురుకులు పుట్టుట.
మధుమేహం – కారణాలు
- ఊబకాయం
- తగినంత శ్రమ / వ్యాయామము లేకపోవడం
- పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా వుండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం
(కొత్త బియ్యంతో మరియు మైదాతో చేసిన ఆహార పదార్ధాలు)
- అతిగా తినడం
- అతిగా నిద్రపోవడం, పగలు నిద్రపోవడం & ఎక్కువగా బద్దకంగా ఉండటం
- ఎక్కువగా మిఠాయిలు, తీపి పదార్ధాలు, పంచదార, బెల్లం, పాలు మరియు పాల పదార్ధాలు తీసుకోవడం
మధుమేహం – సమస్యలు
నియంత్రణ లేని మధుమేహం మూలంగా ఈ క్రింది సమస్యలు వచ్చే అవకాశాలు వున్నాయి.
- అరచేతులు, అరికాళ్లలో మంటలు
- కురుపులు / పుళ్ళు / వ్రణములు తగ్గకపోవడం
- గాంగ్రీన్ (కండను తినివేసే పుండు)
- సాధారణ బలహీనత
- కంటితెరకు (రెటీనాకు) నష్టం కలగడం, చూపు మందగించడం, వేరేరకమైన కంటి జబ్బులు
- మూత్రపిండాల కణజాలం దెబ్బతినడం
- గుండె సంబంధిత వ్యాధులు
- నరములు, రక్తనాళములు దెబ్బతినడం
పైన చెప్పిన సమస్యలు తాకుండా ఉండాలంటే ఎవరైనా చేయవలసిన మరియు చేయకూడని పనులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
మధుమేహం – చేయవలినవి / తినవలసినవి
- సమయానికి తగినంత పరిమాణంలో ఆహరం తీసుకోవడం
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
- రోజూ కనీసం ౩౦ నుంచి 60 నిముషాలు నడవడం, మానకుండా
- ప్రతిరోజూ యోగ, ధ్యానం చేయడం (యోగా గురువు పర్యవేక్షణలో)
- బార్లీ, జొన్న, సంపూర్ణ గోధుమ పిండి మరియు పాత బియ్యంతో చేసిన పదార్ధాలు ఎక్కువగా ఉపయోగించడం.
- పిండిపదార్ధాలు (కార్బోహైడ్రేట్స్) తక్కువగా వుండే ఆహరం తీసుకోవడం
- అన్నం & వేపుళ్లు తక్కువగా తినడము;
- పెసర, కాకరకాయ, మునగ, మెంతి, పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయ, మజ్జిగ తో చేసిన పదార్ధాలు తీసుకోవడం;
- ఎక్కువగా కేలరీలు ఖర్చు అయ్యే పనులు చేయడం (వడివడిగా నడక, ఈత మొదలైనవి)
- గాయాలు కాకుండా చూసుకోవడం, ఒకవేళ గాయమైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
- వ్యక్తిగత శుభ్రతపై అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పాదాలు, చేతులు చాలా శుభ్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి.
మధుమేహం – చేయకూడనివి / తినకూడనివి
- చెరుకురసం, చేరుకుతో చేసిన పదార్ధాలు – బెల్లం, పంచదార మరియు పాల పదార్ధాలు
- అతిగా నిద్ర పోవడం, పగలు నిద్రపోవడం
- మద్యం, పొగ తాగడం
- తగినంత శారీరక శ్రమ లేకుండా మరియు బద్దకంగా ఉండటం
- మిఠాయిలు, ఐస్ క్రీములు, శీతల పానీయాలు సేవించడం
- ఎక్కువ నూనె మరియు కొవ్వు పదార్ధాలు కలిగినవి తినడం
మధుమేహం – ప్రమాద కారకాలు (Risk Factors)
1. కుటుంబ చరిత్ర
2. ఉబకాయం
3. వయస్సు – 45 సంవత్సరాలకన్నా ఎక్కువ
4. అధిక రక్తపోటు
5. శరీరంలో అధికంగా కొవ్వు
6. శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం.
పైన చెప్పినవిధంగా మధుమేహం రావడానికి గల కారణాలను, ప్రమాద కారకాలను అర్ధం చేసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుని మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే, ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించవచ్చు.
Sources :

