ఆయుర్వేదం అనేది ఒక పురాతన జీవ విజ్ఞాన శాస్త్రం. ఆయుర్వేదం లో వ్యాధుల చికిత్సకన్నా, ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.
ఆరోగ్యం మరియు వ్యాధులు ముఖ్యంగా మూడు విషయాల మీద ఆధారపడి ఉంటాయి.
(1) ఆహారం;
(2) విహారం (జీవన విధానంఅనగా లైఫ్ స్టైల్);
(౩) ఔషధం (మందులు & చికిత్సావిధానాలు).
ఈ మూడింటిలో కూడా ఆయుర్వేదంలో ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.
ఈరోజుల్లో అనుసరించే జీవన విధానాలతో రక్తపోటు (బీపీ/హైపర్-టెన్షన్) మధుమేహం (షుగర్/డయాబెటిస్), రక్తంలో / శరీరం లో కొవ్వు పేరుకు పోవటం, ఊబకాయం లాంటివాటితో కలసి గుండె సంబంధిత వ్యాధులు (కార్డియో వాస్క్యూలర్ డిసీసెస్ – సి.వి.డి) వ్యాప్తి చెందుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో ౩౦% గుండె సంబంధిత వ్యాధులతో జరుగుతున్నవే. ఈ విషయంలో ఆయుర్వేదం ఆహార నియంత్రణ, సరైన జీవనశైలి, శరీరంలోని మాలిన/విష పదార్థాలను తొలగించడం, మొదలైన వాటికి సమర్ధవంతమైన సూచనలను, పరిష్కారాలను సూచిస్తుంది/ అందచేస్తుంది.
హృద్రోగ నివారణ – మీ చేతిలో వున్న ఒక శక్తివంతమైన ఆయుధం
ప్రపంచవ్యాప్త మరణాలలో 90 % నివారించ దాగినివే. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే, వాటికి సంబంధించిన ప్రమాద కారకాలని (Risk Factors) దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వస్తే వాటినుండి బయట పడాలి. అందుకోసం అతి సులువైన, తక్కువ ఖర్చుతో కూడుకొన్న ప్రయత్నాలతో మనం ఇటువంటి ప్రమాద కారకాల నుండి బయట పడవచ్చు, ఆయుర్వేద విధానంలో చెప్పినట్లుగా.
ఈ క్రింద చెప్పినట్లుగా “చేయవలసినవి”, “చేయడకూడనివి” మరియు “ఆహారపు అలవాట్లు” పాటిస్తే, మనం హృద్రోగ ప్రమాద కారకాలనుండి బయట పడవచ్చు.
చేయవలసినవి (Dos)
- సరైన ఆహరం మితంగా, సమయానికి తినడం.
- తగినంత శారీరక శ్రమ చేయడం. (వారానికి 2 -1 /2 గంటలు వ్యాయామం, 75 నిమిషాలు ఎక్కువ శ్రమ కలిగిన వ్యాయామం తో).
- ధూమపానం, మద్యం త్రాగడం మానేయడం.
- మానసిక, శారీరక ఉల్లాసానికి – యోగ, ధ్యానం చేయడం.
- శరీర బరువు తగ్గించుకోవడం.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం.
చేయకూడనివి / తినకూడనివి (DON’Ts)
- అతిగా వేడిగా వున్నవి, నూనె కలిగి వున్నవి, కారంగా వున్నవి, వేపుడు పదార్ధాలు తినడం.
- అతిగా కోపగించుకోవడం, భయపడటం, ఒత్తిడికి గురవ్వడం.
- శరీరానికి పడని ఆహరం, చిరాకు (శరీరానికి, మనస్సుకు) కలింగించేవి.
- శరీరభాగాలు సంకోపింపచేసే పదార్ధాలు.
- అతిగా ఉపవాసాలు చేయడం.
- అతిగా కొవ్వు వున్న పదార్ధాలు తినడం.
- ఎక్కువగా విరేచనాలు కలిగించే పదార్ధాలు తినడం.
- ధూమపానం, మద్యం సేవించడం.
- అతిగా ఆహరం తినడం.
- ఎక్కువగా కూర్చోవడం / కదలకుండా ఉండటం / నిద్రపోవడం.
- శారీరక శ్రమ లేకపోవడం.
హృద్రోగం రాకుండా తీసుకోవాలిసిన ఆహార నియమాలు
పైనచెప్పినవాటిని పాటిస్తూ, కింద ఉదహరించిన ఆహారపు అలవాట్లుతో హృదయ సంబంధమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆహారపు అలవాట్లు – తరచుగా తీసికోవలసినవి
- కనీసం 60 రోజుల్లో వచ్చే పంట ధాన్యం ఉపయోగించడం
- పప్పు ధాన్యాలు
- సైన్ధవలవణం
- ఉసిరి
- నెయ్యి
- తేనె
- మజ్జిగ
ఆహారపు అలవాట్లు – తరచుగా తీసికోకూడనివి
- పెరుగు
- పన్నీర్
- పచ్చి ముల్లంగి
- బక్క చిక్కిన (బలహీనమైన) జంతువుల మాంసం
- పంది, గొర్రె, బీఫ్, చేప మాంసం
- తృణధాన్యాలతో చేసిన తీపి పదార్ధాలు
- మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్)
- మినుము
- కొత్త బియ్యం & వాటితో చేసిన పదార్ధాలు, బాసుమతి బియ్యం
- మైదా & వాటితో చేసిన పదార్ధాలు
- బ్రెడ్, నూడుల్స్, పాస్తా
- నల్ల నువ్వులు & మినుములు – వాటితో చేసిన పదార్ధాలు
- బఠాణీ & బొబ్బర్లు (అలచంద)
- మాంసంతో చేసిన సూప్
- బంగాళా దుంపలు, చిలగడ దుంప, బీట్ రూట్, క్యాబేజీ & వాటితో చేసిన పదార్ధాలు
- ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఆలుటిక్కీ
- మద్యం – అన్ని రకాలు (ఎర్ర వైన్ గుండెకు మంచిది)
- సాఫ్ట్ డ్రింక్స్, సోడా, పళ్ళ రసాలు
హృద్రోగ నివారణ కోసం (ప్రివెంటివ్ కార్డియాలజీ) వాడవలసిన ఆహార పదార్ధాలు
| తృణ ధాన్యములు | పప్పు ధాన్యములు | పళ్ళు |
| బార్లీ, గోధుమ, మిల్లెట్లు, కొర్రలు, రాగులు, జొన్నలుపాత బియ్యం (కనీసం ఒక సంవత్సరం నిల్వ ఉంచిన) | కంది పప్పు, ఉలవలు, పెసరలు, సెనగలు | ఉసిరి, వెలగ, చిట్టీత, వృక్ష ఆమ్లా, మారేడు, జంబీరా, దానిమ్మ, మామిడి, రేగు |
| నూనెలు | పాలు & పాల పదార్ధాలు | మసాలా దినుసులు | |
| అవిసె నూనె, ఆవ నూనె | ఆవుపాలు కొంచెం పసుపు కలుపుకొని, వెన్న తీసిన ఆవు మజ్జిగ | పసుపు, మిరియాలు, దాల్చినచెక్క, వెల్లుల్లి శొంఠి, ధనియాలు, జీలకర్ర, మెంతులు |
మేము ఇంకా ఏమైనా మరిచిపోయామా? తెలియ చేయండి.

